Aug 12,2023 19:03

ఫ్యాప్టో జిల్లా కమిటీ డిమాండ్‌ - 12 గంటల ధర్నా విజయవంతం
ప్రజాశక్తి - భీమవరం
రాష్ట్ర ఫ్యాప్టో దసలవారీ పోరాటంలో భాగంగా ఉపాధ్యాయులు, పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన 12 గంటల ధర్నా విజయవంతమైంది. జిల్లా నలుమూల నుంచి సుమారు 500 మంది ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ వద్దకు చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. విస్సాకోడేరు పెద్ద వంతెన దిగువున ఏర్పాటుచేసిన ధర్నా శిబిరం వద్ద 12 గంటల పాటు నిరసన తెలిపారు. సిపిఎస్‌, నూతన విద్యా సంస్కరణలు , జిఒ 117ను రద్దు చేయాలని, ప్రిన్సిపల్‌, విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ వైఖరిని ఖండిస్తూ, బదిలీలు ప్రమోషన్లలో వెళ్లిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని, ఉపాధ్యాయులకు బోధ నేతర పనులు చెప్పొద్దని, ఆన్‌లైన్‌ వర్క్‌కు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఫ్యాప్టో జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఫ్యాప్టో నాయకత్వం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ సందర్భంగా జరిగిన ధర్నా సభకు ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ బిహెచ్‌ జవహర్లాల్‌ రాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి మాట్లాడారు. పాదయాత్ర సమయంలో జగన్‌ సిపిఎస్‌ రద్దు చేస్తామని చెప్పి అధికారం చేపట్టాక ఆ మాటే మరిచారన్నారు. ప్రిన్సిపల్‌, విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌ప్రకాష్‌ ఉపాధ్యాయుల పట్ల అవలంబిస్తున్న వైఖరి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మూడు నెలల నుంచి జీతాలు అందక ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిఒ 117ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్‌.విజయరామరాజు, ఎకెవి.రామభద్రం, ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి.రామచంద్రరావు, ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశం, బివి.నారాయణ, ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రమణ, డిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసరావు, బిటిఎ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, సిపిఎస్‌ సంఘం జిల్లా అధ్యక్షులు వీరవల్లి వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్‌, ఎఐటియుసి నాయకులు కొనాల భీమారావు, మహిళా నాయకులు బాలా కుమారి, కె.శ్రీదేవి మాట్లాడారు. ఈ ధర్నాలో 500 మందికిపైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.