
విఒఎల ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్
ప్రజాశక్తి - భీమవరం
డ్వాక్రా యానిమేటర్లు, ఆర్‌పిలు తమ సమస్యలు పరిష్కరించాలని కదంతొక్కారు. కాల పరిమితి సర్క్యూలర్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడకు తరలివస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి యానిమేటర్లు వందలాది మంది తరలి వచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కాల పరిమితి సర్క్యూలర్ రద్దు చేయాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని చేసిన నినాదాలతో కలెక్టరేట్ హోరెత్తింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.అజరుకుమారి మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక డ్వాక్రా గ్రూపులను, వాటిపని చూసే గ్రామ సంఘాలను, యానిమేటర్లను గాలికొదిలేశారని విమర్శించారు. రూ.10 వేల వేతనం అందించాలని, ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఎనిమిది వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. కాలపరిమితి సర్క్యూలర్ పేరుతో యానిమేటర్లను, ఆర్‌పిలను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. తక్కువ గ్రూపులు ఉన్నాయనే పేరుతో వేతనాన్ని ఎగ్గొట్టడం, విఒఎలను కలిపేసి కొంతమందిని తొలగించాలని చూడడం దారుణమన్నారు. తక్షణం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళ జిల్లా నాయకురాలు డి.కళ్యాణి, సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ డ్వాక్రా యానిమేటర్లు, పట్టణాల్లో ఆర్‌పిలు గ్రామ, వార్డు సంఘాలను ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం సేకరణ, రుణాలు, ఉపకారవేతనాలు అందించడంలో, లబ్ధిదారులను ఎంపిక చేయడంలో బాధ్యత వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం పెట్టే సభలకు జనాన్ని తరలించడంలో, ఓట్లు వేయించడంలో కృషి చేస్తున్నారన్నారు. అయినప్పటికీ యానిమేటర్లను, ఆర్‌పిలను ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తక్షణం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చలో విజయవాడకు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లోకి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎఒకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోవిందమ్మ, పద్మావతి, ఝాన్సీ, కళ్యాణ జ్యోతి, గడ్డం లక్ష్మి, పసుపులేటి రత్నకుమారి, కట్ట నాగలక్ష్మి, అమరావతి, రాజేశ్వరి, దుర్గ లక్ష్మీపార్వతి, పద్మకుమారి, సుధారాణి, భారతి పాల్గొన్నారు.