ప్రజాశక్తి- రాంబిల్లి
నేవల్ బేస్ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు పరిష్కరించకపోవడం అన్యాయమని సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అన్నారు. నేవీ గేట్ వద్ద నిర్వాసితులు చేస్తున్న ఆందోళన సోమవారం నాటికి 36వ రోజుకు చేరింది. సిపిఐ నేత బాలేపల్లి శిబిరాన్ని సందర్శించిన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేవీ సబ్ గేట్లు తెరిచి చేపల వేటకు అనుమతి ఇవ్వాలని, ఫిషింగ్ జెట్టీ నిర్మించాలని, జీవన భృతి ఇవ్వాలని తదితర డిమాండ్లతో నేవీ నిర్వాసితులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం ఎనిమిది గ్రామాల ప్రజలు భూములు, నదులు వదులుకున్న నిర్వాసితులకు జీవనోపాధి కల్పించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారి యంత్రాంగంపై ఉందని స్పష్టం చేశారు. నెల రోజులపైబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నేవీ నిర్వాసితుల పోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. సిపిఎం మండల కార్యదర్శి జి.దేవుడునాయుడు మాట్లాడుతూ మంగళవారం ఉదయం నేవీ మెయిన్ గేట్ నుండి 8 గ్రామాల నిర్వాసితులు తహశీల్దారు కార్యాలయం వరకు మహా పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో అన్ని పార్టీల నాయకులు, ప్రజాతంత్ర వాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దొరబాబు, నేవీ నిర్వాసితుల జెఎసి నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు.










