ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలు పరిష్కరించేవరకు పోరాడుతామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిరవధిన నిరాహారదీక్షలు చేపట్టారు. దీక్షలను రాష్ట్ర కార్యదర్శి ఎ. అశోక్ ప్రారంబించారు. పలు ప్రజాసంఘాల నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు. దీక్షలను ఉద్దేశించి అశోక్ మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉన్నాయని తెలిపారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర రావు మాట్లాడుతూ విజయనగరంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని , కానీ అవి ఈ నగర పాలకులకు పట్టకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. విజయనగరం జిల్లా పోరాటాల కిల్ల అని , పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, దీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు సిహెచ్ పావని మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప పరిష్కారం కావడం లేదన్నారు. ఐదేళ్ల క్రితం నిరాహార దీక్షలు చేసిన సందర్భంగా విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తే నేటి వరకు ప్రభుత్వం నెరవేర్చ లేదన్నారు. సమస్యల పరిష్కారం కాకపోతే విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం రుచి చూడక తప్పదని అన్నారు.
దీక్షకు మద్దతు తెలిపిన శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ వి.లక్ష్మి మాట్లాడుతూ పాఠశాలల విలీనం ద్వారా అనేకమంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోయారని ,దీనికి కారణమైన ఎన్‌ఇపిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ మాట్లాడుతూ విద్యార్థుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతుంటే దున్నపోతు పై వర్షం పడుతున్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్న వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ వెంకటేష్, పి. రామ్మోహన్, జిల్లా సహాయ కార్యదర్శి జె. రవి కుమార్, జిల్లా కమిటీ సభ్యులు పి. రమేష్, కె. రమేష్, ఎస్.సమీరా, నాయకులు వి.భారతి, కె. డేవిడ్ ఉన్నారు. దీక్షలకు మద్దతు తెలిపిన వారిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి. సూర్యనారాయణ, కెవిపి ఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్ ఉన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మద్దతు తెలిపారు.