Jul 19,2023 23:33
ప్రదర్శన నిర్వహిస్తున్న యూనియన్‌ నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-బాపట్ల: గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ 4వ రాష్ట్ర మహాసభలు జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో బాపట్ల ఎన్జీవో హోంలో బుధవారం అట్టహాసంగా జరిగా యి. మహాసభ సందర్భంగా బాపట్ల పట్టణంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. నూతనం గా ఏర్పడిన బాపట్ల జిల్లాలో తొలిసారిగా జరిగిన రాష్ట్ర నాలుగో మహాసభకు గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నూతన అధ్యక్షులు డి వెంకట్రా మయ్య అధ్యక్షత వహించిన సభలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ నూర్‌ మహమ్మద్‌ మాట్లాడు తూ రాష్ట్రంలో 13వేల గ్రామ పంచాయతీల్లో 27వేల 8వందల మంది, మరో 18 వేలమంది క్లాప్‌ మిత్రలు పనిచేస్తున్నారని అన్నారు. వారి సమస్యలు పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభు త్వం పూర్తి స్థాయిలో విఫలమైందని అన్నారు. ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని, కనీస వేతనాలు అమలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న కార్మికులను తొలగించి వారి పొట్టగొట్టాడన్నారు. సమ స్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన 551 జీవోలో ఉన్న గుర్తింపు కార్డులు, కనీస వేతనం, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు. కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె ఉమామహే శ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఒకే విధమైన వేతనాలు అమలు కావడం లేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల్లో అభద్రతా భావాన్ని పెంచి వెట్టిచాకిరీ చేయించేందుకు అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పంచాయతీ వర్కర్ల సమస్యలపై భవిష్యత్తులో పోరాటం కొనసాగించాలని సభలో తీర్మానం చేశారు
16 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా వెంకటరామయ్య, కార్యదర్శిగా నూర్‌ మహమ్మద్‌
గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నూతన రాష్ట్ర కమిటీ 16 మందితో ఏకగ్రీవం గా ఎన్నికయింది. కమిటీ నూతన అధ్యక్షులుగా డి వెంకట రామయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ నూర్‌ మహమ్మద్‌, గౌరవాధ్యక్షులుగా కె ఉమామహేశ్వరరావు, కోశాధికారి కె శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఎం పోలినాయుడు, జి రామాంజనేయులు, ఇ వెంకటేశ్వరరావు, జి నాగేశ్వరరావు, చిన్నారావు, కార్యదర్శులుగా వి కోటిరాము, కె శివప్రసాద్‌, సిహెచ్‌ సుబ్బారావు, అనిల్‌ కుమార్‌, రమేష్‌ ఎన్నికయ్యారు. తొలుత సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించారు. మహాసభలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష్య కార్యదర్శులు సిహెచ్‌ మణిలాల్‌, సిహెచ్‌ మజుందార్‌, బాపట్ల పట్టణ కార్యదర్శి జే శామ్యూల్‌, కే శ్రీనివాసరావు, వివిధ జిల్లాల కమిటీల నాయకులు పాల్గొన్నారు.