Jul 23,2021 21:39
విజయవాడ అలంకార్‌ సెంటర్లోని ధర్నాచౌక్‌లో ఫ్యాప్టో ఆధ్వర్యాన జరిగిన ఉపాధ్యాయుల ధర్నాలో మాట్లాడుతున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు

* ఫ్యాప్టో ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు
ప్రజాశక్తి-యంత్రాంగం :
రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టరేట్లు, సబ్‌ కలెక్టరేట్లు, తాలూకా కేంద్రాలు, తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో ఆధ్వర్యాన) ధర్నా చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కరిస్తామని, ఉద్యోగులతో తమ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందని తెలిపినప్పటికీ, గత రెండేళ్లలో ఏనాడూ చర్చించలేదన్నారు. 2018 జులై నుండి పిఆర్‌సి అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికే 36 నెలలు ఆలస్యమైందని తెలిపారు. వెంటనే పిఆర్‌సి నివేదికను బహిర్గతపరిచి 55 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, బకాయి ఉన్న ఆరు డిఎలను వెంటనే మంజూరు చేయాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, జెఎసి నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు, పెన్షనర్లు ధర్నాలో పాల్గని సంఘీభావం తెలిపారు.

కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నంతోపాటు 16 కేంద్రాల్లో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. విజయవాడ అలంకార్‌ సెంటర్లోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నెరవేర్చాలని, కోవిడ్‌తో చనిపోయిన ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో కో-చైర్మన్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 11వ పిఆర్‌సి సిఫార్సులు 2018 జులై ఒకటో తేదీ నుండి అమలు చేయాలని కోరారు. డిటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులను వేరుచేయొద్దని, అన్ని యాజమాన్యాలలోని పాఠశాలల్లో నెలవారీ ఉద్యోగోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గుంటూరులో ర్యాలీ నిర్వహించారు. ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ నూతన విధానం అమల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలల విభజన వల్ల ప్రాథమిక విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కర్నూలులోని ధర్నా చౌక్‌లో ఉపాధ్యాయుల ధర్నా శిబిరాన్ని ఫ్యాప్టో రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాష్‌రావు ప్రారంభించి ప్రసంగించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గన్న యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.బాబురెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పైబడినా ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ధర్నాలో ఎపి ఎన్‌జిఒ, ఎఐటియుసి నాయకులు పాల్గని మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు జగన్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ కలెక్టరేట్‌, రాజమహేంద్రవరంలో సబ్‌ కలెక్టర్‌ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన ధర్నాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ పాల్గొని ప్రసంగించారు. కడప జిల్లా రైల్వేకోడూరులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, కడపలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ, ఎన్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, హెచ్‌ఎం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.వి.నారాయణరెడ్డి, ఫ్యాప్టో, ఐటా, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు సంఘాల నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నాలో ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం తహశీల్దార్‌ కార్యాలయం, విశాఖ జిల్లా భీమునిపట్నం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ పాల్గని మద్దతు తెలిపారు. శ్రీకాకుళం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాకు ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ రాష్ట్ర సహాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు, హనుమంతు సాయిరాం సంఘీభావం తెలిపారు. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఉపాధ్యాయులు ధర్నా చేశారు.