ప్రజాశక్తి - ముదినేపల్లి
గత 25 ఏళ్లుగా వణుదుర్రు గ్రామంలో దళితులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు పరిష్కరించాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం ముదినేపల్లి మండల కార్యదర్శి చిన్నం మాధవ కోరారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాధవ మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు లేవని, మంచినీరు సమస్య, డ్రెయినేజీ సమస్యలతో పాటు శ్మశాన వాటికకు స్తంభాల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. కొత్తపల్లి నుంచి వణుదుర్రు, దేవపూడి వరకు ప్రధాన రోడ్డు వెంబడి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, గ్రామంలోని మెట్ల రేవును అభివృద్ధి చేయాలని, నడవడానికి కాల్వపై వంతెన సౌకర్యం ఏర్పాటు, ప్రజలు కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయాలంటూ వినతి పత్రంలో కోరారు. మాధవ ఇచ్చిన వినతిపత్రంలో ఉన్న సమస్యలపై సంబంధిత అధికారి నారాయణమూర్తి సానుకూలంగా స్పందించినట్లు మాధవ తెలిపారు. మాధవతో పాటు బొడ్డు సురేష్ ఉన్నారు.










