ప్రజాశక్తి - బుట్టాయగూడెం
పని ఒత్తిడి కారణంగా చనిపోయిన గ్రామ రెవెన్యూ అధికారుల కుటుంబాలకు న్యాయం చేయాలని, రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని విఆర్‌ఒలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విఆర్‌ఒలు మాట్లాడుతూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు 658 జిఒ ప్రకారం వెంటనే ఉద్యోగం ఇవ్వాలని కోరారు. విఆర్‌ఒలు చనిపోతే వారి కుటుంబానికి ఇప్పటివరకు కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేదన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులకు పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. విఆర్‌ఒలకు అవసరమైన కంప్యూటర్ సిస్టమ్స్ స్టేషనరీ ఇవ్వాలన్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విఆర్‌ఒలు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సెలవు రోజుల్లో, పండుగ రోజుల్లో విఆర్‌ఒలకు విధులు అప్పగించకుండా ఆదేశాలు జారీ చేయాలన్నారు. జిల్లా, డివిజన్ కేంద్రాల్లో జరిగే సమావేశాలకు విఆర్‌ఒలను పిలవకుండా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. కొంతమంది అధికారులు గ్రామ రెవెన్యూ అధికారులను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ప్పుడుపడితే అప్పుడు కార్యాలయానికి హాజరు కావాలని చెప్పడంతో మానసికంగా శారీరకంగా బాధపడుతున్నామని విఆర్‌ఒలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విఆర్‌ఒ పోస్టులను భర్తీ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బుట్టాయగూడెం మండలంలోని విఆర్‌ఒలు పాల్గొన్నారు.
చింతలపూడి : పని ఒత్తిడి కారణంగా చనిపోయిన గ్రామ రెవెన్యు అధికారులకు రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించాలని తహశీల్దార్ కృష్ణజ్యోతికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం నాయకులు శ్రీను, గోపి, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఒ సంఘం జంగారెడ్డిగూడెం డివిజనల్ అధ్యక్షులు అడపా రాంబాబు ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ విఆర్‌ఒలకు పని ఒత్తిడి తగ్గించాలని, పని ఒత్తిడి కారణంగా చనిపోయిన విఆర్‌ఒల కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. విఆర్‌ఒల సమస్యలు పరిష్యరించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందించిన వారిలో విఆర్‌ఒ సంఘం మండల అధ్యక్షుడు ఏసుబాబు, ఉపాధ్యక్షులు ఎ.నాగేశ్వరరావు పాల్గొన్నారు.ముసునూరు : స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారుల సంఘం మండల అధ్యక్షులు పి.శోభన్‌బాబు, నూజివీడు డివిజన్ సెక్రటరీ ఎన్.మస్తాన్‌రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహశీల్దార్ దాసరి సుధకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ అధికారులకు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విఆర్‌ఒల కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒలు హరిబాబు, ఎం.యశోధమ్మ, బి.రవి, శోభన్‌బాబు, మస్తాన్‌రావు, పి.నవీన్ పాల్గొన్నారు.
భీమడోలు : స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ అధికారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రామ రెవెన్యూ సంఘ భీమడోలు శాఖ అధ్యక్షులు కెడివి.ప్రసాద్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ షంషుద్దీన్‌కు అందించారు.










