Feb 14,2023 21:47

ప్రజాశక్తి - ఏలూరు
         తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో విఆర్‌ఎలు స్థానిక కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో విఆర్‌ఎలు హాజరయ్యారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, తగ్గించిన డిఎను యధావిధిగా కొనసాగించాలని, నామినీలను విఆర్‌ఎలుగా గుర్తించాలని, జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా విజయవాడలో విఆర్‌ఎల ధర్నా శిబిరానికి విచ్చేసి తాను ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లో మీ వేతనాలు పెంచుతానని, సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన వాగ్దానం చేశారని గుర్తు చేశారు. మూడున్నర సంవత్సరాలు గడిచినా ఆ హామీలేవీ అమలు కాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న విఆర్‌ఎలు మూడున్నర సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా వేతన పెంపుదల లేకుండా జీవిస్తున్నారన్నారు. తక్షణమే విఆర్‌ఎలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న డ్రైవర్‌, వాచ్‌మెన్‌, అటెండర్‌ పోస్టులను విఆర్‌ఎలతో భర్తీ చేయాలని కోరారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మాజీ, కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విఆర్‌ఎలకు ఏళ్ల తరబడి ఇస్తున్న డిఎను జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపేసిందని విమర్శించారు. ఇస్తున్న డిఎను సైతం ఆపడం దారుణమన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమానికి వల్లీ, కాలేషా, ఆంజనేయులు, ఫకీర్‌, మీరావలి, నరసన్న, మోహన్‌రావు, రవి తదితరులు నాయకత్వం వహించారు.