ప్రజాశక్తి - భీమడోలు
కొనుగోలు చేసిన ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా ఏర్పడుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు పూళ్ల రైతు భరోసా కేంద్రం వద్ద, గుండుగొలను సొసైటీ సమీపంలో సోమవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గుండుగొలను సొసైటీ వద్ద టిడిపి నాయకులు సిరిబత్తిన కొండబాబు ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తమ అవసరాలకు సరిపడా రీతిలో గోనె సంచులు అందించాలని, రవాణా సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. పూళ్ల రైతు భరోసా కేంద్రం వద్ద ఇవే సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు ఆందోళన చేపట్టారు. భీమడోలు ఇన్‌ఛార్జి తహశీల్దార్ షంషుద్దీన్, వ్యవసాయ అధికారి ఉషారాణి ఆందోళన చేస్తున్న రైతులకు సర్ది చెప్పారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.










