Aug 04,2023 22:30

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
              గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జిల్లా నలుమూలల నుండి పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని, 010 ద్వారా వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని పెద్దఎత్తున నినదించారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి పరిపాలనలో పంచాయతీల్లో పగలనక, రేయనక సేవలందిస్తున్న పంచాయతీ కార్మికులకు సక్రమంగా ప్రతినెలా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం తాగునీరు, వీధిదీపాల నిర్వహణ వంటి కీలక పనులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికులకు ఆరు నెలల నుండి 20 నెలలపాటు వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. వేతనాలు లేక కార్మికుల కుటుంబాలు పస్తులుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు తక్షణం జోక్యం చేసుకుని వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు వాగ్దానం చేసిన విధంగా తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. టెండర్‌ విధానాన్ని రద్దు చేస్తానని వాగ్దానం చేసిన జగన్మోహన్‌రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా దాని ఊసెత్తకపోవడం అన్యాయమన్నారు. ఏళ్ల తరబడి పని చేసిన కార్మికులకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్న టెండర్‌ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బంగారు కృష్ణ మాట్లాడుతూ కార్మికులందరికీ పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలో నిధుల్లేక ఎటువంటి రక్షణా పరికరాలు కార్మికులకు అందజేయడం లేదని, దానివల్ల కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక గ్రామాల్లో కార్మికులపై తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని, తక్షణమే వేధింపులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆటో యూనియన్‌ నాయకులు జె.గోపీ సంఘీభావం తెలిపారు. ధర్నాకు యూనియన్‌ జిల్లా నాయకులు నాగరాజు, వెంకటేశ్వరరావు, ఫణీంద్ర, పుల్లయ్య, రాంబాబు, లక్ష్మి నాయకత్వం వహించారు.