Sep 05,2023 20:11

ప్రజాశక్తి - పెనుమంట్ర
హర్యానా రాష్ట్రంలోని ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని సిఐటియు ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగుపాటి జ్యోతి అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆశా డే సందర్భంగా ఆల్‌ ఇండియా ఆశా యూనియన్‌ పిలుపు మేరకు మార్టేరు పిహెచ్‌సి వద్ద మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల రెబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దిగుపాటి జ్యోతి మాట్లాడుతూ హర్యానా ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆగస్టు 8 నుండి జరుగుతున్న శాంతియుత సమ్మెకు ప్రభుత్వాలు అనేక ఆటంకాలు కలిగిస్తూ నాయకత్వంపై నిర్బంధాలు, అరెస్టులు చేయడం మానవ హక్కులను కాల రాయడమేనని విమర్శించారు. సమ్మెలో పాల్గొంటున్న ఆశా వర్కర్లను పోలీసు వ్యానుల్లో ఎక్కించి దౌర్జన్యంగా రోజంతా కనీసం తాగునీరు, వసతులు కూడా కల్పించకుండా మహిళలను అత్యంత దుర్మార్గంగా వేధించడం పట్ల ఆశా వర్కర్స్‌ యూనియన్‌గా ఖండిస్తున్నామని తెలిపారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, సమ్మెకు యూనియన్‌ సంఘీభావం తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడర్లు లక్ష్మీ దుర్గ, పి.రత్నకుమారి, కె.కనకదుర్గ, పార్వతి, నాగలక్ష్మి, శ్రీదేవి, గంగారత్నం, భవాని, సుశీల పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్‌ : హర్యానాలో ఆశా వర్కర్లపై జరిగిన లాఠీఛార్జికి నిరసనగా లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు చింతపల్లి లక్ష్మి మాట్లాడుతూ హర్యానాలో అక్కడి ప్రభుత్వం ఆశాలపై విచక్షణా రహితంగా లాఠీఛార్జి చేయడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు సిహెచ్‌ లక్ష్మి, ఎ.శ్యామలాంబ, కె.కృపామేరీ, విజయదుర్గ, కె.ముణికుమారి, డి.నాగమణి, నిర్మల కుమారి పాల్గొన్నారు.
నరసాపురం టౌన్‌ : హర్యానాలో ఆశా వర్కర్లపై జరిగిన లాఠీఛార్జికి నిరసనగా స్థానిక ఎన్‌టిఆర్‌ కాలనీలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వద్ద ఆశాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము మాట్లాడుతూ హర్యానా ప్రభుత్వం అక్కడ ఆశాలపై విచక్షణా రహితంగా లాఠీఛార్జీ చేయడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు కవిత, జ్యోతమ్మ, రత్న కుమారి పాల్గొన్నారు.