ప్రజాశక్తి - ఏలూరు టౌన్
మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. సిపిఎస్‌ను రద్దు చేయాలని, ఇంజినీరింగ్ విభాగం సిబ్బందికి హెల్త్ అలవెన్సులు అమలు చేయాలని, క్లాప్ ఆటోల డ్రైవర్లకు జిఒ నెంబర్ 7 ప్రకారం కనీస వేతనాలు, ఆదివారం, పండుగ సెలవులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ వర్కర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ సిఎం జగన్ ఎన్నికలకు ముందు మున్సిపల్ ఉద్యోగులకు, కార్మికులకు ఇచ్చిన హామీలు నాలుగేళ్లుగడిచినా నేటికీ అమలు చేయలేదన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇంజినీరింగ్ విభాగం వర్కర్లకు హెల్త్ అలవెన్సులు అమలు చేయాలని, క్లాప్ డ్రైవర్లకు జిఒ నెంబర్ ఏడు ప్రకారం రూ.18,500 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ రద్దు చేయాలన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేలు మాత్రమే ఇస్తోందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 40 వేల మంది నెలకు రూ.ఐదు వేలు చొప్పున నష్టపోతున్నారన్నారు. ఈ సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మె చేపడతారని హెచ్చరించారు. అనంతరం ఏలూరు అధ్యక్షులు లావేటి కృష్ణారావు, జంగారెడ్డిగూడెం కార్యదర్శి బి.బాలరాజు, క్లాప్ ఆటో డ్రైవర్ల నాయకులు బట్టు సుగుణరావు, పుష్పరాజు, గణేషులు, బండి భవానీ మాట్లాడారు. ఈ ధర్నాకు సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు బి.జగన్నాథరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి వి.సాయిబాబు, పంతం నాగరాజు, తానంకి జార్జి, కారు దుర్గారావు, బంగారు వెంకటేశ్వరరావు, ఎ.ఏసురత్నం, ఎం.గోపి, వి.రాము, పి.సారయ్య, జయకుమార్, మరియన్న, నాగమణి, కాంతమ్మ, బంగారు లక్ష్మీ, అల్లం జ్యోతి, జి.లక్ష్మణరావు, వేల్పుల రాజు, కొత్తపల్లి ఉష, కొత్తూరు లక్ష్మణరావు, మండల అప్పల స్వామి నాయకత్వం వహించారు. అనంతరం వినతి పత్రాన్ని డిఆర్‌ఒ ఎవిఎస్‌ఎన్.మూర్తికి అందజేశారు.










