ప్రజాశక్తి - ఏలూరు
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ముఖహాజరు (ఎపిఎఫ్‌ఆర్‌సి) విధానం వల్ల కార్మికుల జీతాల్లో కోత విధించే అవకాశం ఉందని, ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని, దీన్ని రద్దు చేయాలని కోరారు. 2022 జూలై నెలలో మున్సిపల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన జిఒ159ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయలేదని, ఏడు నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్య థోరణి అవలంభిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే స్థానికంగా మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, స్థానిక అధికారులు వాటిని పరిష్కరించాలని కోరారు. కార్మికులు పనిచేయడానికి కావాల్సిన చెత్త డబ్బాలు, తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, కంపాక్టర్ వాహనాలు, గ్లౌజులు, మాస్కులు, యూనిఫారం, చెప్పులు, సబ్బులు వగైరా ఏర్పాటు చేయాలని కోరారు.
విలీన పంచాయతీ కార్మికులకు రావాల్సిన 2022 జూన్ నెల జీతం వెంటనే ఇవ్వాలని, స్కూల్ స్వీపర్లకు మూడు నెలల బకాయి జీతాలు ఇవ్వాలని, ఇంజినీరింగ్ వర్కర్స్‌కి రావాల్సిన పదో పిఆర్‌సి ఏరియర్స్ రూ.64 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబు, ఏలూరు నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావు, కార్యదర్శి కారు దుర్గారావు, నాయకులు తానంకి జార్జి, బంగారు దుర్గారావు, బి.రమేష్, జయకుమార్, నరమామిడి నాగమణి, బంగారు సీత, బి.విమల, బంగారు శ్రీను, పి.సారయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జె.గోపి పాల్గొన్నారు.










