ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
మున్సిపల్ క్లాప్ ఆటోల డ్రైవర్ల జీతాల్లో అక్రమంగా కోతలు కోసిన డబ్బులు తిరిగి జమ చేయాలని, యాజమాన్యం వేధింపులు ఆపాలని, ఎలాంటి కారణం లేకుండా అక్రమంగా తొలగించిన డ్రైవర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని క్లాప్ ఆటోల డ్రైవర్లకు జిఒ 7 ప్రకారం రూ.18,500 కనీస వేతనం, ఇతర చట్టబద్ధ రాయితీలు అమలు చేయాలని నేడు క్లాప్ ఆటోల డ్రైవర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. అక్రమంగా తొలగించిన డ్రైవర్‌ను విధుల్లోకి తీసుకోవాలని, జీతాల్లో కోతలు కోసిన డబ్బులు తిరిగి జమ చేయాలని వారు నినదించారు. స్థానిక వంగాయగూడెం వెహికల్ డిపో వద్ద టెంట్ వేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ యాజమాన్యం కక్షపూరిత ధోరణి వీడి క్లాప్ ఆటోల డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జానుబాబు, ఆటో డ్రైవర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పె.గోపీ, నగర ప్రధాన కార్యదర్శి రవీంద్ర సంఘీభావం తెలిపారు.










