ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు శనివారం సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కమిషనర్ జె.రామఅప్పలనాయుడుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. తక్షణమే మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులందర్నీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పర్మినెంట్ ఉద్యోగులకు రెండేళ్లు సరెండర్ లీవ్ వేతనాలు ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికులకు బకాయి హెల్త్ అలవెన్స్ విడుదలకు చర్చలు చేపట్టాలని, క్లాస్ ఆటో డ్రైవర్లకు రూ.18,500 వేతనం ఇవ్వాలని, బకాయి పడిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ హెల్త్ రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, ఆప్కాస్ వల్ల 60ఏళ్లు నిండిన వారు, అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సాలూరు, పార్వతీపురం, పాలకొండ లో వెంటనే నియామకాలు చేపట్టాలని, పట్టణంలో పెరుగుతున్న జనాభాకు తగినంత మంది కార్మికుల సంఖ్యను పెంచి ఉన్న కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారంలో భాగంగా ఈనెల 20,21న రిలేనిరాహార దీక్షలు, 27న మున్సిపల్ కార్యాలయం ముట్టడి, ఆగస్టు 7న చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు బంకురు సూరిబాబు, కార్మికులు నాగవంశం శంకర్రావు, చీపురుపల్లి సింహాచలం, నాగవంశం మల్లేషు, నాగవంశం నిర్మల, పడాల గాంధీ, మామిడి శివ, బంగారి రాజేష్ , బంగారి రవి, తదితర కార్మికులు పాల్గొన్నారు.










