ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఇఎస్‌ఐ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు మెరుగైన ఆసుపత్రి సేవలు, మందులు, పెన్షన్లు, సిక్ వేతనాలు, నిరుద్యోగ భృతి తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ శుక్రవారం స్థానిక ఇఎస్‌ఐ డిస్పెన్షరీ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఈ ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ ఇఎస్‌ఐ పథకాన్ని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. ఇఎస్‌ఐ సొమ్ము రూ.లక్షా 20 వేలు కోట్లు రిజర్వు నిధులున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఏలూరులో 40 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి, నూజివీడు, జంగారెడ్డిగూడెం, ముదినేపల్లిలో ఇఎస్‌ఐ డిస్పెన్షరీలు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లో ఇఎస్‌ఐ 30 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, ఇఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఆధునిక పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది, మందులు వంటి సౌకర్యాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ ఇఎస్‌ఐ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు రావడం లేదని, రెఫరల్ ఆసుపత్రులు రోగులను చేర్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు సొంతంగా డబ్బు పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.సాయిబాబు, కె.వెంకట్రావు, జె.గోపీకృష్ణ పాల్గొన్నారు.










