ప్రజాశక్తి-అద్దంకి: మండల పరిధిలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఏడు వారాల నుంచి కార్మికులకు రావలసిన వేతన బకాయిలు రాకపోవడం వలన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఉపాధి కార్మికులకు ప్లే స్లిప్పులు ఇవ్వాలని, గతంలో వలెనే మేట్ల విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమ్మర్ అలవెన్స్, మంచినీళ్లు, పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణంలో కూడా ఉపాధి పథకాన్ని వర్తింపజేయాలని కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు రోజుకు 600 రూపాయలు ఉండేలా చూడాలని కోరారు. ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా డిలీట్ అయిన జాబ్ కార్డులను పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు జి వెంకట్రావు, ఎం కిషోర్ ఎం రమేష్ టీ నాగూర్ హనుమయ్య పాల్గొన్నారు.










