Nov 12,2022 00:39

ఎంపిడిఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిస్కరించాలంటూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండలంలోని డి.మల్లవరం గ్రామ గిరిజనులు శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అద్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ డి.మల్లవరం గ్రామంలోని సమస్యలపై అనేక పర్యాలు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రహదారి సదుపాయం సక్రమంగా లేక గ్రామ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణం మధ్యలో ఆపివేశారని, దీంతో అంగన్వాడీ కేంద్రాన్ని అద్దె భవనంలో నిరహిస్తున్నారని తెలిపారు. తక్షణం నూతనభవనం నిర్మించాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో వీధిరోడ్లు, డ్రైన్లు, విద్యత్‌ లైట్లు, కొండపోడు పట్టాలు వంటి సమస్యలు పరిస్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపిడిఓ కె.బాపన్నదొర, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ అరుణకు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కె జగన్నాథం, కె సూరిబాబు గిరిజనులు కె ప్రవీణ్‌, కె దొరబాబు, గంగరాజు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.