Nov 21,2023 21:02

ప్రజాశక్తి - యంత్రాంగం
         అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా మంగళవారం ఒకరోజు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, వివిధ కార్మిక ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.
ఏలూరు అర్బన్‌:అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తెలంగాణ కంటే అదనంగా రూ.వెయ్యి ఇస్తానని సిఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ మంగళవారం ఐసిడిఎస్‌ ఏలూరు ప్రాజెక్టు ఆఫీస్‌ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షనుద్దేశించి సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వి.సాయిబాబు మాట్లాడుతూ అంగనవాడీలు గ్రాడ్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు చెప్పినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రిటైర్మెంట్‌ అనంతరం వారి జీతంలో సగం పెన్షన్‌ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. రూ.11,500 జీతం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అనర్హులను చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ అంగన్‌డీలకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడి వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ఆఫీస్‌ బేరర్‌ పి.హైమావతి మాట్లాడుతూ అంగన్వాడీలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని, వారిపై అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ ప్రారంభించి మద్దతు తెలిపారు. సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు బి.జగన్నాథరావు, పి.కిషోర్‌, అంగన్‌వాడీ జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ స్వప్న, ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు రజని, దుర్గా భవాని నాయకత్వం వహించారు. సెక్టార్‌ లీడర్లు అరుణ్‌ కుమారి, ఎన్‌.వెంకటలక్ష్మి, లత పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.భారతి విమర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ వద్ద పోలవరం, కొయ్యలగూడెం అంగన్‌వాడీలు, హెల్పర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పరిష్కరించలేదన్నారు. దశలవారీగా అనేకమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే వచ్చేనెల ఎనిమిదో తేదీ నుంచి సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు రాంబాబు, యూనియన్‌ నాయకులు పిఎల్‌ఎస్‌.కుమారి, నాగవేణి, ఎం.శివరత్నకుమారి, ఎ.జ్యోతి, పద్మజ, వెంకటలక్ష్మి, మాధవి, భాగ్యలక్ష్మి, సీత, సరస్వతి, నాగలక్ష్మి, మణి పాల్గొన్నారు.
చింతలపూడి :అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు ఆర్‌విఎస్‌.నారాయణ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిడిపిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్స్‌ జెఎసి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సిఐటియు, ఎఐటియుసి నేతలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు నత్తా వెంకటేశ్వరావు, సత్యనారాయణ, టి.మాణిక్యం, ఎన్‌.సరోజని, జి.సరళ, పి.ఫణివర్ధిని, కవిత, అరుణ, శాంతిశ్రీ, కుమారి, ఎఐటియుసి నాయకులు మరియమ్మ, అంజమ్మ పాల్గొన్నారు.
బుట్టాయగూడెం:అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ, పెన్షన్‌, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద అంగన్‌వాడీలు రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు కెవి.రమణ మాట్లాడుతూ 48 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవలందిస్తున్న అంగన్‌వాడీలను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కానీ వీరంతా అతి తక్కువ గౌరవవేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నారన్నారు. కనీస వేతనాలు అమలుకావడం లేదని, పెరిగిన నిత్యావసరాల ధరలతో ఆర్థికంగా నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మినీఅంగన్‌వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. పనిభారం తగ్గించాలని, రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకుకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50శాతం పెన్షన్‌ ఇవ్వాలన్నారు కోరారు. మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు చిట్టిబొమ్మ కొండలరావు, కృపామణి, పుష్ప, రామలక్ష్మి, భూదేవి, నూర్జహాన్‌, నాగమణి, సుధ, కన్నమ్మ, మున్నీ పాల్గొన్నారు.
భీమడోలు : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌ వాడీలు ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆర్‌.లింగరాజు, నారాపల్లి రమణరావు మాట్లాడారు. ప్రభుత్వం న్యాయ సమ్మతమైన అంగన్వాడీల సమస్య లను పరిష్కరించాలని కోరారు. అనంతరం ప్రాజెక్ట్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బి.రాజామణి, బి.స్వర్ణకుమారి, సుజాత, ప్రేమాన్విత, చల్లా మణి, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాలకు చెందిన అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
కలిదిండి : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కైకలూరు సిడిపిఒ కార్యాలయం వద్ద సిఐటియు అధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షలకు మండలంలోని అంగన్‌వాడీలు పెద్దఎత్తున తరలివెళ్లారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు శేషపు మహంకాళిరావు, ఎస్‌కె.అబిదాబేగం, వెంకటలక్ష్మీ, రమాదేవి తరలి వెళ్లినవారిలో ఉన్నారు.
నూజివీడు రూరల్‌ : అంగన్‌వాడీ వర్కర్ల, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నూజివీడులో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సిఐటియు నేతలు హనుమాన్లు, జి.రాజు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రాజకుమారి, ఆదిలక్ష్మి, వసుంధర, విజయ, ప్రమీల, విద్యావతి, పుల్లమ్మ, కనకదుర్గ, మణి, జ్యోతి, కృష్ణవేణి పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్‌కె.సుభాషిణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక సిఐటియు ఆధ్వర్యంలో పి.సూర్యరావు అధ్యక్షతన స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆఫీస్‌ వద్ద ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సుభాషిణి పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు టిడిపి నాయకులు సత్యనారాయణ, రాజ్‌పాల్‌, శ్యామ్‌సుందర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మానుకొండ జీవరత్నం, మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు జి.సూర్యకిరణ్‌, యూనియన్‌ నాయకులు విమల, లక్ష్మీదేవి, జి.సత్యవేణి, సునీత, శాంతి, జి.సుబ్బాయమ్మ, జి.విజయకుమారి పాల్గొన్నారు.