ప్రజాశక్తి-జగ్గయ్యపేట: మండలంలోని చిల్లకల్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన తెలిపారు. కనీస వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యూటీ ఇవ్వాలని, ఫేస్ యాప్‌ను రద్దు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు రాము మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెను చార్జీలు పెంచాలని, 2007 నుంచి పెండింగ్ లో ఉన్న టిఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, సీనియార్టీ ప్రకారం వేతనాలు ఇచ్చి సూపర్వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలన్నారు. హెల్పర్స్ ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలు పెంచాలని, ప్రమోషన్ లలో రాజకీయ జోక్యం అరికట్టాలని, 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్‌గా మార్చాలని కోరారు. అనంతరం ఐసిడిఎస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకల్లు ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు టి మధుకుమారి, అంజమ్మ, ఉమా, ప్రసన్న, ప్రమీలరాణి, ఆర్ మేరీ, నాగచంద్రిక తదితరులు పాల్గొన్నారు.










