
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీలకు గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్ కల్పించాలని, తెలంగాణ కంటే వేతనం పెంచుతామన్నా ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8నుంచి సమ్మె చేయనున్నామని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అర్బన్ సిడిపిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా జీతం పెంచుతానని ఎన్నికల ముందు ప్రకటించి నేటికీ అమలు చేయకుండా జగనన్న మోసం చేశారని, శాంతియుత ప్రదర్శనలు, ధర్నాలను నిషేధిస్తూ జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి నిర్బంధాన్ని ప్రయోగించారని అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా మరింత పని భారం పెంచారని, లబ్ధిదారులను, పిల్లలను సెంటర్లకు దూరం చేసే నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు కావడంలేదనీ మరోవైపు ఉద్యోగులమని చెప్పి సంక్షేమ పథకాలు నిలిపివేశారని మండిపడ్డారు. ఈ సమస్యలపై డిసెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని లబ్ధిదారులు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాలో ప్రభ, విశాలాక్షి, సరళ, ప్రసన్న, శివలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.