Aug 07,2023 21:16

దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మధరావు

కలెక్టరేట్‌: సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు 36 గంటలు నిరసన దీక్షలు స్థానిక కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ప్రారంభమయ్యాయి. విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు గరుగుబిల్లి ఈశ్వరరావు అధ్యక్షతన ప్రారంభమైన ఈ నిరసన దీక్షలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, విఆర్‌ఎ సంఘం కార్యదర్శి జి.కృష్ణారావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే విఆర్‌ఎల సమస్యలు పరిష్కారిస్తామని చెప్పారు. కానీ నేటికీ సమస్యలు పరిష్కారం కాలేదని, కనీస వేతనం రూ.26,000, అర్హులైన వారికి వాచ్మెన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పదోన్నతులు కల్పించాలని, రికవరీ చేసిన డిఎని తిరిగి చెల్లించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్‌ఎలుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. గత కొన్నాళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా కనీసం స్పందించడం లేదన్నారు. తప్పని పరిస్థితుల్లో 36 గంటలు దీక్షలకు దిగామని, ఇప్పటికైనా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రెడ్డి వేణు, శ్రామిక మహిళ నాయకులు ఇందిరా, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, పట్టణ నాయకులు బి.సూరిబాబు, డి.శ్రీను, సుదర్శన్‌, మిన్నారావు, రామయ్యయ, బాబురావు, పలు మండలాల విఆర్‌ఎ పాల్గొన్నారు.