Oct 31,2023 22:15

అజెండాలోని అంశాలకు డీసెంట్‌ ఇస్తున్న అధికార పార్టీ కౌన్సిలర్లు

        హిందూపురం: 'కౌన్సిల్‌ ఏర్పడినప్పటి నుంచి ప్రతి నెలా జరిగే కౌన్సిల్‌ సమావేశంలో వార్డుల అభివృద్ది కోసం నిధులు కేటాయిస్తున్నారు... అయితే అభివృద్ధి ఎక్కడా జరగలేదు.. అనేక సమస్యలు పట్టణంలో ఉన్నాయి.. వీటిని పరిష్కరించాలని ప్రతిసారీ సమావేశం దృష్టికి తెస్తున్నాం.. అయినా పరిష్కారంకాలేదు.. సమస్యలు పరిష్కారం కానప్పుడు ప్రతి నెలా సమావేశాలు ఎందుకు పెడుతున్నారు..' అంటూ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ ఆసీఫ్‌వుల్లా తదితరులు అధికారులు, పాలకవర్గాన్ని ప్రశ్నించారు. మంగళవారం ఉదయం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ అద్యక్షతన అత్యవసర కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. టిడిపి కౌన్సిలర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినదాలు చేస్తూ సమావేశం హాల్లోకి వచ్చారు. కౌన్సిలర్‌ రోషన్‌ ఆలీ రెవెన్యూ విభాగంలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ ఛైర్‌పర్సన్‌కు వినతిని ఇచ్చారు. మరికొందరు కౌన్సిలర్లు వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరించారు. 10వ వార్డు కౌన్సిలర్‌ పార్వతి తన వార్డుల్లో అక్రమ నల్ల కనెక్షన్ల తొలగింపు విషయం తమ దృష్టికి తీసుకురాకుండా అధికారులు వ్యవహరించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌ ఆసీఫ్‌వుల్లా మాట్లాడుతూ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. వాణిజ్య భవనాల అద్దెలు, పన్నుల వసూళ్లలోనూ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోందని తెలిపారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడుతూ నిధుల సమస్య కారణంగా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని సమాధానం ఇచ్చారు. సమావేశం జరుగుతుండగానే అధికార పార్టీకి చెందిన 15 మంది కౌన్సిలర్లు అజెండాలోని 9 అంశాలకు డీసెంట్‌ ఇవ్వడంతో సమావేశాన్ని మమ అనిపించి ముగించేశారు. ఈ సమావేశంలో వైస్‌ ఛైర్మన్లు జబీవుల్లా, బలరామిరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.