Sep 15,2023 20:52

ప్రజల సమస్యలు వింటున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

చాపాడు : గ్రామ స్థాయిలోని సమస్యలను మండల స్థాయిలోనే అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ వి.విజరురామరాజు అధికారులను ఆదేశించారు. మైదుకూరు ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మండలస్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి, జెసి గణేష్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, బద్వేలు ఆర్‌డిఒ వెంకటరమణ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా మండలస్థాయిలో ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒక్కో రోజు ఒక్కో మండలంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పరిష్కార నివేదికలు స్పష్టంగా ఉండాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజమైన ప్రజల వద్దకు పాలన ఈ రోజు మైదుకూరు పట్టణంలో ప్రత్యక్షంగా, సుస్పష్టంగా దర్శనమిస్తోందని ప్రశంసించారు. జిల్లాస్థాయి అధికారులు మొత్తం మైదు కూరు మండలంలో తిష్టవేసి గ్రామాల్లో సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. స్థానిక ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోహం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు, తహశీల్దార్‌ అనురాధ, ఎంపిడిఒ రమణారెడ్డి, మండలస్థాయి అధికారులు, మైదుకూరు మున్సిపల్‌ చైర్మన్‌ మాచునూరు చంద్ర, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ శ్రీమన్నారాయణరెడ్డి, మండలాధ్యక్షులు థామస్‌, ఉప మండ లాధ్యక్షులు రఘురామిరెడ్డి, తిప్పిరెడ్డిపల్లె సర్పంచు బండి నాగేంద్రప్రసాద్‌, వైసిపి నాయకులు కిరణ్మయి, ప్రజలు పాల్గొన్నారు.
ప్రెస్‌క్లబ్‌కు స్థలం కేటాయించాలని వినతి
మైదుకూరులో ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మైదుకూరు నియోజకవర్గ, మండల పాత్రికేయులు కలెక్టర్‌ వి.విజరు రామ రాజుకు అర్జీ ద్వారా విన్నవించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ రాష్ట్ర సమా చార కమిషనర్‌ నుండి అనుమతి తెచ్చుకుంటే మైదుకూరు మండల కేంద్రం లో తప్పకుండా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కేటాయిస్తామన్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చొరవతో అప్పట ివరకు తెలుగుగంగ క్వార్టర్స్‌లో నిరుపయో గంగా ఉన్న ఒక భవనాన్ని ప్రెస్‌క్లబ్‌ నిర్వహణ కోసం కేటాయించమని మైదు కూరు మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.