ప్రజాశక్తి- పెద్దకడబూరు
తమ వార్డు సమస్యలు ఎమ్మెల్యేకు కనిపించడం లేదని పెద్దకడబూరు పదో వార్డు మహిళలు విమర్శించారు. ఆదివారం వారు దుర్వాసన వస్తున్న కాలువలను చూపిస్తూ మాట్లాడారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి శుక్రవారం తమ వార్డు మీదుగా వెళ్లారని తెలిపారు. తమ వార్డు సమస్యలు ఆయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తాగునీరు, డ్రెయినేజీ సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారని, ఇప్పటివరకు చేసిందేమీ లేదని తెలిపారు. తమ వార్డులో ఓట్లు అడగడానికి సర్పంచి, వార్డు సభ్యులు వచ్చారని, వారికి కూడా సమస్యలు కనిపించడం లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే డ్రెయినేజీ నీరు మొత్తం ఇళ్లలోకి చేరుతోందని, దుర్వాసన వస్తోందని తెలిపారు. ఇంట్లో ఉన్న పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. వార్డు సభ్యులు కూడా చూస్తూనే ఉంటారని, సమస్యను పరిష్కరించకుండానే వెళ్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తాయని, అప్పుడు ఓట్లు అడగడానికి తమ వార్డుకు వస్తారని, అప్పుడు తామెంటో చూపిస్తామని హెచ్చరించారు.