Apr 18,2023 23:38

జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికురాలిని పరామర్శిస్తున్న యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : పారిశుధ్య కార్మికురాలు కనపర్తి విమల ఆత్మహత్యాయత్నానికి కారణమైన గుంటూరు నగరపాలక సంస్థ 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎక్కలూరి మారుతి కోటిలింగారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి శిక్షించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విమలను మున్సిపల్‌ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల్ని ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని సిఎం ఒకవైపు చెబుతుంటే... సమస్యలు ఉన్నాయని చెప్పిన మున్సిపల్‌ కార్మికురాలిపై కక్ష సాధింపుతో విధుల నుంచి తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. తనను అకారణంగా పనిలో నుంచి తొలగించినందున తిరిగి పనిలో పెట్టుకోవాలని కనపర్తి విమల చెప్పులు అరిగేలా కార్పొరేటర్‌, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ఆఫీసుకు తిరిగినా వారు కనికరించలేదన్నారు. పక్షవాతంతో 8 ఏళ్లుగా మంచానికే పరిమితమైన భర్త, కుమారుడు చదువు, కుటుంబ నిర్వహణ భారమైందని మనస్థాపంతో కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పారు. దళితురాలు అయిన కనపర్తి విమల ఆత్మహత్యాయత్నానికి కారకులైన కార్పొరేటర్‌ మారుతి కోటిలింగారెడ్డిపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే విమలను పనిలోకి తీసుకోవాలని నగర కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ది గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు మాట్లాడుతూ జిఎంసి పరిధిలో పారిశుధ్య కార్మికులపై వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధుల వేధింపులు పెరిగాయన్నారు. కనపర్తి విమల ఆత్మహత్యాయత్నం మొదటిది కాదని, చిన్నచిన్న కారణాలతో మున్సిపల్‌ శానిటేషన్‌ అధికారులు కార్మికులను రోజుల తరబడి పనిలో నిలుపుదల చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇబ్బందులకు గురవుతున్న కార్మికులకు సిఐటియు అనుబంధ మున్సిపల్‌ కార్మిక సంఘం అండగా ఉంటుందని, వారి తరఫున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కోశాధికారి ఎస్‌.జ్యోతిబసు, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంగమ్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి, జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, నగర కోశాధికారి షేక్‌ ఖాసింవలి, నాయకులు షేక్‌ ఖాసీంషహీద్‌, ఎం.కిరణ్‌, రూపస్‌, సుధీర్‌ ఉన్నారు.