జ్యూట్ మిల్లు మూసివేతతో కార్మికవాడపై అంతులేని నిర్లక్ష్యం
వీధి దీపాల తొలగింపుతో అంథకారం
ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారం
నివాసాల మధ్య ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు
ప్రజాశక్తి- తగరపువలస : పాలకుల పుణ్యమాని చిట్టివలస జ్యూట్ మిల్లు 2009 ఏప్రిల్ 20న శాశ్వతంగా మూతబడింది. దీంతో జ్యూట్ కార్మికవాడలో నివసిస్తున్న కార్మికుల బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారు. కార్మికవాడలో మౌలిక సదుపాయాల కల్పన ఊసే మరిచారు. మిల్లు పనిచేసే సమయంలో ఇక్కడి క్వార్టర్లలో 560 కుటుంబాలు నివసిస్తుండేవి. మౌలిక సదుపాయాల కల్పనపై కార్మికుల పోరాటంతో అప్పట్లో జ్యూట్ యాజమాన్యం అప్పట్లోనే స్పందించేది. కానీ ఫ్యాక్టరీ మూత తర్వాత యాజమాన్యం సుమారు 400 మంది కార్మికులకు బకాయిచెల్లించడంతో వారంతా క్వార్టర్లను ఖాళీ చేయగా, ఇపుడు 160 కుటుంబాలు మిగిలాయి.
కార్మికులు, కార్మిక కుటుంబాలు లేరన్న కారణంతో క్వార్టర్లు, విద్యుత్ స్తంభాలకు ఉన్న కనెక్షన్లు తొలగింపుతో కార్మిక వాడలో అంధకారం అలుముకుంది. దీనికి తోడు ఎక్కడికక్కడే ఏపుగా, దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలు మొలవడం, చిన్నపాటి కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో కార్మికవాడలో అటుగా వెళ్లేందుకు నివాసితులు సైతం నానా అవస్ధలు పడుతున్నారు. పిచ్చిమొక్కల మధ్య నివాసాలు విషసర్పాలు, కీటకాలకు ఆవాసంగా మారుతోందని అక్కడివారు భయపడుతున్నారు.
శిథిóలావస్టకు చేరిన క్వార్టర్లు..
ఫ్యాక్టరీ మూత తర్వాత అక్కడి క్వార్టర్లు వినియోగంలో లేకపోవడంతో అధికశాతం శిధిలావస్టకు చేరాయి. ఇంటి పైకప్పులు నుంచి పెంకులు, మట్టి పెల్లలు ఎక్కడి కక్కడే పోగులుగా పడిపోయాయి. దీంతో అపరిశుభ్రత నెలకొంది.
వీధి దీపాలు వెలిగించాలి
ఎక్కువమంది కార్మిక కుటుంబాలు లేవన్న కారణంగా విద్యుత్‌లైన్లు, వీధిదీపాలు తొలగించారు.కార్మిక వాడలో రాత్రి వేళల్లో నడిచి వెళ్లే పరిస్థితి లేదు. వెంటనే వీధి దీపాలు వెలిగించాలి.
సిహెచ్.మంగవేణి
పిచ్చిమొక్కలు తొలగించాలి
కార్మికవాడలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు తొలగించాలి. కాలువలను శుభ్రపరచాలి. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం దోమలకు ఆవాసంగా మారింది.
ఎం.ఆదిలక్ష్మి










