Sep 05,2023 23:50

డిఆర్‌డిఎ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న విఒఎలు

         పుట్టపర్తి అర్బన్‌ : సమస్యల పరిష్కారంపై విలేజ్‌ అర్గనైజింగ్‌ సెక్రటరీలు (విఒఎ)లు పోరుబాట పట్టారు. ఉద్యోగభద్రత కల్పించాలని, మెర్జ్‌ ఇతర నిర్ణయాలను ఆపాలని డిమాండ్‌ చేస్తూ పుట్టపర్తి డిఆర్‌డిఎ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ విఒఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మూడు సంవత్సరాల కాలపరిమితిని జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. మూడు సంవత్సరాల కాలపరిమితి విధించడం వల్ల దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న విఒఎలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపేతం చేయడంలో వీళ్ల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. గ్రామ సమైక్యలో కలపాలన్న నిర్ణయం ఆపాలన్నారు. వివోఏలకు నష్టం లేకుండా ఎక్కువ సంఘాలు ఉన్న వివోఏ నుంచి తక్కువ సంఘాలున్న వివోఎలకు సర్దుబాటు చేయాలన్నారు. ఇతర ప్రభుత్వ సేవలు కూడా నిర్వహిస్తున్న వీరికి కేవలం 8 వేలు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. వయస్సు పైపడి అనారోగ్యం ఉన్నవారి కుటుంబంలో ఒకరికి విఒఎలుగా అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ నరసయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివోఎల యూనియన్‌ జిల్లా నాయకులు రవీంద్ర, హనుమంతు రాయుడు, నాగేంద్ర, నరసింహులు, రంగనాథ్‌, సుజాత, అనసూయ, ప్రమీల, సురేఖ, కీర్తి పాల్గొన్నారు.