Jul 19,2023 00:18

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి- అనకాపల్లి : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లి కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్‌ఓ వెంకటరమణకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి ఫణింద్ర కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ విద్యా సంవత్సరం నుంచి 4 సంవత్సరాల డిగ్రీ విద్యను ప్రవేశ పెట్టిందని, దీనివల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులు వారు చదివే సబ్జెక్టులు లేక విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలో, పాఠశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు పెంచి మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనకాపల్లి గాంధీనగరంలో ఉన్న ఎస్సీ, బీసీ హాస్టల్లో విద్యార్థులు హాస్టల్‌ భవనాలు శిథిలావస్థలో ఉండడం వల్ల ఎప్పుడు ఏమవుతుందోననే భయంతో ఉంటున్నారని, వీటికి మరమ్మతులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాజు ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి సతీష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు శివ, రమేష్‌, అరుణ్‌, శిరీష, రోషిని, చైతన్య విద్యార్థులు పాల్గొన్నారు.