May 31,2023 23:34

తాగునీటిపై అధికారులను ప్రశ్నిస్తున్న వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు... చైర్‌పర్సన్‌ మంగతాయరు సమక్షంలో సమాధానం చెబుతున్న కమిషనర్‌ నయీమ్‌



సామర్లకోట మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం
ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
పలు సమస్యలపై అధికార పార్టీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. సామర్లకోట మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం బుధవారం స్ధానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన మున్సిపల్‌ కమిషనరు నయామ్‌ అహ్మద్‌ నిర్వహించారు.తొలుత మున్సిపాలిటీలో త్రాగునీరు అందిస్తున్న పరిస్థితి పై కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు అధికారులపై ధ్వజమెత్తారు. దానితో కౌన్సిల్‌ సమావేశం గరంగా సాగింది. సమావేశంలో తొలుత ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు జీరో ఆవర్‌ ప్రకటించగా వైసిపి కౌన్సిలర్లు పితాని కృష్ణ, నేతల హరిబాబు, కరణం రాజ్‌ కుమార్‌లు తాగునీటి సరఫరా మున్సిపల్‌ కమిషనర్‌ను నిలదీశారు. కుళాయిల ద్వారా ఈ మధ్యకాలంలో తాగునీరు నాచుతో, బురదగా వస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని వారు ప్రశ్నించారు. ఇదే గోదావరి జలాలపై ఆధారపడి నిర్వహిస్తున్న పెద్దాపురం మున్సిపాలిటీకి చెందిన ఫిల్టర్‌ ప్లాంట్‌ చెరువులో జలాలు అత్యంత శుద్ధంగా ఉంటుండగా సామర్లకోట ఫిల్టర్‌ బెడ్‌ చెరువులో మాత్రం ఎందుకు జలాలు కలుషితమవుతున్నాయని ధ్వజమెత్తారు. పెద్దాపురం కాకినాడ పట్టణాలకు రాని తాగునీటి సమస్య సామర్లకోటకే ఎందుకు వస్తుందని వారు నిలదీసారు. ఇటీవల లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఫిల్టర్‌ ప్లాంట్‌ ను ఆధునీకరించగా జలాలు ఎందుకు శుద్ది కావడం లేదని కమిషనర్ను ప్రశ్నించారు.
ఈ విషయాలపై కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన కౌన్సిలర్లు ఆవివరణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొం టున్న తాగునీటి ఇబ్బందిపై మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఊబా జాన్‌ మోసెస్‌, మహిళా కౌన్సిలర్‌ కాళ్ల శ్యామల తదితరులు అధికారులను నిలదీశారు. అనంతరం జరిగిన ఎజెండా చర్చలో కాంట్రాక్టర్ల విషయంలో ఒకే కాంట్రాక్టర్‌కు మున్సిపాలిటీలో అన్ని అభివృద్ధి పనులు ఎందుకు కట్టబెడుతు న్నారని కౌన్సిలర్‌ నేతల హరిబాబు అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌తో ముందుగానే అధికారులు ఒప్పందం చేసుకుని ఇలా అన్ని కాంట్రాక్టులు ఒకే వ్యక్తికి కట్టబడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆరోపించారు. కాగా సమావేశం మధ్యలోనే పలువురు కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోగా, మొక్కుబడిగా కౌన్సిల్‌ సమావేశం జరిగింది. సమావేశానికి మున్సిపల్‌ డిఇ హాజరు కాకపోవడపై కౌన్సిల్‌ సభ్యులు ప్రశ్నించారు. అయోమయ రీతిలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మున్సిపల్‌ అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.