Nov 15,2022 00:02

ధర్నా అనంతరం ఐటిడిఎ పిఒకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నేతలు, స్టాపర్‌ పేట గ్రామస్తులు

ప్రజాశక్తి-చింతూరు
మండలంలోని కల్లేరు గ్రామపంచాయతీ పరిధి స్టాపర్‌పేట గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు సిపిఎం ఆధ్వర్యంలో చింతూరు ఐటిడిఏ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. దీనికి ముందు చింతూరు సిపిఎం కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని, స్టాపర్‌ పేట సూరనుగొందిలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలని, పంట బోర్లను రిపేర్‌ చేయించాలని, కల్లేరు నుండి మధుగురు వరకు బిటి రోడ్‌ నిర్మాణం చేపట్టాలని, గ్రామాలకు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, అర్హులైన గిరిజనులకు సాగుభూమికి పట్టాలు ఇవ్వాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ధర్నా వద్దకు వచ్చిన ఐటిడిఎ పిఓ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. సమస్యలపై పిఓ సానుకూలంగా స్పందిస్తూ రోడ్డు నిర్మాణానికి వస్తున్న ఇబ్బందులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల అభివద్ధి కొరకు సబ్‌ ప్లాన్‌ నిధులను విడుదల చేయాలని కోరారు. ఏజెన్సీలోని అనేక గ్రామాలు నేటికీ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోనే ఉన్నాయని, వాటిని రెవెన్యూ గ్రామాలుగా మార్చి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. పాఠశాలలు, అంగన్వాడీలు భవనాలు శిథిలమవుతున్న భవనాల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్‌, పోడియం లక్ష్మణ్‌, కారం సుబ్బారావు, పాండు దుర్గారావు, కారం సీతయ్య, సాయం నారాయణ, సోడే బాబురావు తదితరులు పాల్గొన్నారు.