ప్రజాశక్తి-విజయనగరంటౌన్, కోట : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన జగనన్నకు చెబుదాంలో పలు సమస్యలపై ప్రజలు ఏకరువు పెట్టారు. జగనన్నకు చెబుదాంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం కనిపించడం లేదని ఆవేదన చెందారు. ఈవారం అత్యధికంగా 244 వినతులు వచ్చాయి. అనంతరం వినతుల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ నాగలక్ష్మి సమీక్షించారు. ఆయా ప్రభుత్వ శాఖలకు వచ్చిన వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులు స్వీకరించినప్పటి నుంచి కింది స్థాయి సిబ్బంది ఆయా వినతులను ఏవిధంగా పరిష్కరిస్తున్నారు, ఆయా అర్జీదారుల కోరిన విధంగా అర్జీ పరిష్కారం అవుతున్నదీ లేనిదీ పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, మండల ప్రత్యేకాధికారులు తమ పరిధిలో వచ్చిన వినతుల పరిష్కారంపై నివేదికలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. రీ ఓపెన్ అయిన కేసులను కూడా గడువులోగా పరిషారం అయ్యేలా చూడాలన్నారు. అర్జీ దారు ఇంటికి వెళ్లి ఇకెవైసి కూడా చేయాలని తెలిపారు. వినతులను కలెక్టర్‌తో పాటు జెసి మయూర్ అశోక్, ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్‌లు పద్మలత, సూర్యనారాయణ, సుదర్శన దొర తదితరులు స్వీకరించారు.
అక్రమ వాటర్‌ప్లాంట్‌ను ఎందుకు సీజ్‌చేయరు?
అయ్యప్పనగర్‌లో గెడ్డను ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ఎందుకు సీజ్‌చేయడం లేదని అధికారులను పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షడు వి.రామచంద్రరావు, అయ్యప్పనగర్ అసోసియేషన్ నాయకులు యు ఎస్ రవి కుమార్, కార్యదర్శి సుధీర్ ప్రశ్నించారు. ఈమేరకు కలెక్టర్‌కు స్పందనలో వినతినిచ్చారు. గెడ్డను ఆక్రమించి,ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా వాటర్ ప్లాంట్ నడుపుతున్న స్వాతీ ప్యూర్ పైడ్ వాటర్ ప్లాంట్ యాజమాని పూసర్లమధును అరెస్ట్ చేసి, ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకొని, అక్రమ ప్లాంట్ సీజ్ చెయ్యాలని కోరారు.
- మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ ఆధ్వర్యాన కలెక్టర్‌కు వినతినిచ్చారు. అత్యాచారాలు, హత్యలకు గురవుతున్న బాధిత మహిళ కుటుంబాలకు ు రక్షణ,భద్రత కల్పించి,వారికి పునరావాసం చర్యలు చేపట్టాలన్నారు. రేషన్ డిపోల ద్వారా కందిపప్పు సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు వి.లక్ష్మి, ఎం.సౌమ్య పాల్గొన్నారు. జామి మండలం భీమసింగి పంచాయతీ రెల్లి పేటకు చెందిన రెల్లి కులస్తులకు గతంలో ప్రభుత్వాలు స్థలాలు మంజూరు చేశాయి. ప్రస్తుత ప్రభుత్వం ఇల్లు కట్టుకోవాలని చెబితే అందరూ నిర్మించుకున్నారు. కానీ వీరికి ఎల్‌పిసి సర్టిఫికెట్ లేకపోవడంతో బిల్లులు రాక లబోదిబోమంటూ స్పందనలో వినతులిచ్చారు. పైడితల్లి అమ్మవారి పండగ నేపథ్యంలో పట్టణంలో రహదారులను బాగు చేయాలని టిడిపి నాయకులు కలెక్టర్‌కు వినతినిచ్చారు. నాలుగో తరగతి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.గంగాప్రసాద్ వినతినిచ్చారు.










