Oct 12,2023 00:15

సమస్యలపై స్పందించకపోవడం సిగ్గుచేటు


సమస్యలపై స్పందించకపోవడం సిగ్గుచేటు
హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి : రాస్తారోకోలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: వీవోఎలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల పాటు వంటావార్పు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని, వెంటనే వీవోఏ హెఆర్‌ పాలసీ అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు విఓఏ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు ధర్నా ముగింపు సందర్భంగా తిరుపతి- వేలూరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాస్తారోకోను భగం చేయడానికి టూటౌన్‌ సిఐ, ఎస్‌ఐలు నిలువరించే ప్రయత్నం చేసినా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పడితే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. వీవోఏలకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ రూ.పది లక్షలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. మహిళా సంఘ సభ్యులు నుండి మహిళా మార్ట్‌ల ద్వారా వస్తువులు కొనాలని ఒత్తిడి తీసుకురావడం దారుణమన్నారు. ప్రజల దగ్గర డబ్బులున్నప్పుడు కొనుక్కుంటారని, బలవంతంగా వారి నుండి వస్తువులు కొనిపిచ్చే కార్యక్రమం మానుకోవాలని హితవుపలికారు. జిల్లాలో పెనుమూరు, జీడి నెల్లూరు, ఎస్‌ఆర్‌ పురం, గంగవరం, పూతలపట్టు, చిత్తూరు, బంగారుపాళ్యం మండలాల్లో అధికారులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మహిళా సంఘ సభ్యులకు కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నదన్నారు. జిల్లాలో అధికారులు పోరాటం చేసే సందర్భంలోనే కుంటి సాకులతో అన్ని రకాల పనులు చేయించడం ఏంటని ప్రశ్నించారు. మిగతా సమయంలో పనులు గుర్తుకు రావా తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరించారు. హక్కుల కోసం పోరాడే హక్కు ఎవరికైనా ఉందని దానిని అడ్డుకోవడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేస్తున్న విఓఎలకు మెడపై కత్తిలా ఉన్న 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్‌ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, విఓఎల విలీనం ఆపాలని, సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. విఓఎల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో వెలుగు యానిమేటర్స్‌ విఓఎలు కలెక్టర్‌ కార్యాలయం వద్ద 36 గంటల ధర్నా రెండో రోజు కొనసాగింది. రాత్రిపూట కూడా మొక్కవోని దీక్షతో తమ ఆందోళన కొనసాగించారు. వంటావార్పు కార్యక్రమం కూడా అక్కడే కొనసాగించి భోజనాలు చేశారు. విఓఎల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షులు జీను రాజశేఖర్‌, కార్యదర్శి పి.నాగరాజు, ఉపాధ్యక్షులు శ్రీధర్‌, మంగమ్మ, శేషాద్రి, సహాయ కార్యదర్శులు మణి, చంద్రకళ విఓఏల పాల్గొన్నారు.