ప్రజాశక్తి-తెనాలి : వార్డుల్లో సమస్యలు పేరుకుపోతున్నాయని, పలుమార్లు చెప్పినా పట్టించుకోవటంలేదని అధికార పక్ష కౌన్సిలర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్‌పర్సన్ సయ్యద్ ఖలేదా నశీం అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో గురువారం నిర్వహించారు. తొలుత ప్రత్యేక సమావేశం నిర్వహించి కాంట్రాక్టు నియామకాలకు సంబంధించి ప్యానెల్ కమిటీలో కౌన్సిలర్లు కొమరాబత్తిని జయపాల్, అవుల కోటయ్య, తిరుమలశెట్టి సామ్రాజ్యంకు చోటు కల్పించినట్లు చైర్‌పర్సన్ ప్రకటించారు. అజెండా అంశాలు పూర్తికాగానే చైర్‌పర్సన్ ప్యానెల్ కమిటీని ప్రకటించారు. ప్యానెల్ కమిటీలో అన్నాబత్తుని పద్మజ, పెదలంక లక్ష్మీలావణ్య, షేక్ దుబారుబాబు, పేరం సంజీవరెడ్డిను నియమించినట్లు చైర్‌పర్సన్ ప్రకటించారు. అజెండా ఆమోదం తరువాత నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమావేశంలో 23, 24, 25 వార్డు కౌన్సిలర్లు తోక శిరీష, పెదలంక లక్ష్మీలావణ్య, తాడిబోయిన రామయ్య సమస్యలు ఏకరువు పెట్టారు. రాజీవ్ గృహకల్ప వద్ద మురుగునీరు రోడ్డుపై పారుతోందని, డ్రెయిన్ల మరమ్మతులు చేపట్టలేదని, తీవ్ర దుర్గంధంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. గత సమావేశంలో డ్రెయినేజ్ సమస్యలు పరిష్కరిస్తామని చైర్‌పర్సన్ స్వయంగా చెప్పి పట్టించుకోలేదని అన్నారు. దీనిపై స్పందించిన ఎంఈ నాగమల్లేశ్వరరావు సంబంధిత కాంట్రాక్టర్‌కు రెండుసార్లు నోటీసులు జారీ చేసినా స్పందనలేదని వివరించారు. చైర్‌పర్సన్ మాట్లాడుతూ పనులు చేయని కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా డ్రెయినేజ్ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 11వ వార్డు కౌన్సిలర్ కఠారి రత్నకుమారి మాట్లాడుతూ తమ వార్డులో తాగునీటి పైప్‌లైన్ నుంచి మురుగునీరు వస్తోందని చెప్పారు. దీనిపై ఏఈ చైతన్య స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరిస్తామన్నారు. కౌన్సిలర్లు బోయపాటి అరుణ, అన్నం పిన్నారావు, షేక్ ఇస్మాయిల్, అవుల కోటయ్య ఆయా వార్డుల్లో సమస్యలను ప్రస్తావించారు. ఆయా సమస్యలపై చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ బదులిచ్చి, సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. సమావేశంలో కమిషనర్ ఎం.జస్వంతరావు, అసిస్టెంట్ కమిషనర్ అనూష, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










