ప్రజాశక్తి - కాకినాడ
కాకినాడ నగరంలో 37వ డివిజన్ కచేరిపేటలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో నగర నాయకులు ర్యాలీగా వెళ్లి సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సచివాలయ అడ్మిన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ నగర కమిటీ సభ్యులు టి.రాజా, కె.నాగజ్యోతి మాట్లాడుతూ కాకినాడ కలెక్టర్ ఆఫీస్‌కి అర కిలోమీటర్‌లో ఉన్న కచేరిపేటలో కాలువ గట్టు మీద ఉంటున్న ప్రజలకు మంచినీటి సౌకర్యం పూర్తిస్థాయిలో లేదన్నారు. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే మంచినీరు వస్తుందన్నారు. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు సౌకర్యం ఉండి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ తాగునీరు మాత్రం రావడం లేదని విమర్శించారు. కాలువ గట్టుమీద మూడు కరెంట్ స్తంభాలు వేయాల్సి ఉండగా ఒక స్తంభం నుండే దాదాపుగా 15 ఇళ్లకు కరెంటు వైర్లు లాగడంతో వైర్లన్నీ ఇళ్ల మీద, రోడ్డుమీద నడిచి వెళ్లే వాళ్లకి అందే అంత ఎత్తులో ఉన్నాయని తెలిపారు. తక్షణం మరొక రెండు కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈశ్వరరావు, సింహాచలం, చంద్రరావు, భూలక్ష్మి, గౌరీ, భవాని, లోవ, మంగ, దుర్గ, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.
కాకినడ 37 వ డివిజన్‌లో ధర్నా నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు










