పార్టీ విస్తృత స్థాయి జిల్లా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సీతారాం
ప్రజాశక్తి-విఆర్.పురం : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలతో కుదేలైపోతోన్న దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి సిపిఎం కార్యకర్త సైనికుడిలా పనిచేయాల్సి అవసరం ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన సీతారాం పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ కార్యకర్తల జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడుతూ, తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయి, రాష్ట్రం ఆర్ధిక సంక్షోభం దిశగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టేసి చోద్యం చూస్తోందన్నారు. గతేడాది సంభవించిన వరదల్లో బాధితులకు ఇంతవకు సాయం ఇవ్వకపోవడం దారుణమన్నారు. వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు మతతత్వవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆంద్రప్రదేశ్‌లో బిజెపి ఆటలు సాగబోనివ్వమన్నారు. ఎన్నికలకు మరో ఏడాది కాలం మాత్రమే ఉన్నందున కార్యకర్తలంతా సంఘటితంగా పనిచేసి, నియోజకవర్గంలో కమ్యూనిస్టుల జెండా ఎగిరేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పోలవరం నిర్వాసితుల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా తలుగుతుందని, వరద గోదావరిలో కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టంచేశారు. సమావేశంలో రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, లోతా రామారావు, వాణిశ్రీ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, పులి సంతోష్‌కుమార్, పంకు సత్తిబాబు, యర్రంశెట్టి, సీసం శ్రీనివాసరావు, మర్లపాటి నాగేశ్వరరావు, మేకల నాగేశ్వరరావు, ఐవి వెంకటేశ్వర్లు, సాయం సీతారామయ్య, ఏడు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










