ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యాన రజకులు శుక్రవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నానుద్దేశించి సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ, రజకుల వృత్తి స్థలాలను, దోబీఘాట్లను వైసిపి నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటూ రజకులకు తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రజకుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. వైసిపి పాలన వచ్చాక రజకుల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు. విశాఖ నగరంలో వాషింగ్ సెంటర్లను నిషేధించాలని, రజకుల కోసం ప్రత్యేకంగా కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటుచేయాలని, నెలకు కనీసం రూ. 50 వేలు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనులు, రజకులు,నాయి బ్రాహ్మణులు వంటి వృత్తి పనుల వారికి ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఈశ్వరరావు, అధ్యక్షుడు బి. ఆనందరావు మాట్లాడుతూ, రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలని, జీవో 343 ప్రకారం చెరువులపై రజకులకు హక్కు కల్పించాలని, 50 సంవత్సరాలు పైబడిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని, రజక వృత్తికి దోబీ ఘాట్లు మంజూరు చేసి, వాటిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర బడ్జెట్లో రజకులకు రూ.1000 కోట్లు కేటాయించాలని, రజకుల లాండ్రీలకు నెలకు 250 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో ఎం. విజరు, వి.నాగేంద్ర, ఎం.శ్రీనివాసరావు, ఎం.రాములు, రమణమ్మ, జె.బంగారమ్మ, ఆర్.నాగమణి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధి వర్గంగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.










