సమస్యలపై ప్రత్యేక దృష్టి వహించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : గ్రామాలలో సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారుల దృష్టికి తీసుకొస్తున్న వివిధ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించేలా చూడాలని ఆత్మకూరు ఎంపిపి కేతా వేణుగోపాల్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్వసభ్య సమావేశం అజెండాలో పొందుపరిచిన అంశాలను అధికారులు వివరించారు. అనంతరం ఎంపిపి కేతా వేణుగోపాల్‌రెడ్డి, జెడ్‌పిటిసి పెమ్మసాని ప్రసన్నలక్ష్మి శాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి అధికారులను, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మకూరు మండలం వాసిలిలో అక్రమాలపై చర్యలు ఇప్పటికీ చర్యలు చేపట్టలేదని ఎంపిటిసి వీర రాఘవులు ప్రశ్నించారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ భవనాల కోసం తెచ్చిన సిమెంటు స్వాహా, పంచాయతీ భవనం పాఠశాల భవనం తొలగించినప్పుడు వచ్చిన సామగ్రి స్వాహా వ్యవహారంలో సంబంధితులపై ఏమి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఎంపిపి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నిధులు విడుదల చేస్తున్నారని, ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులు, ఆయా శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో ఇప్పటికే చర్చించి నిధులు విడుదల చేయిస్తున్నారని తెలిపారు. వీటన్నింటితో ఆత్మకూరు మండలంలో అవసరమైన అభివృద్ధి పనులను త్వరగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామీణ ప్రాంతంలో అవసరమైన పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రతిఒక్కరూ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియచేస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. తాగునీటి సరఫరా విషయమై చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న జగనన్న లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులకు పొదుపులో ఉండి అర్హత ఉంటే ఇళ్ల నిర్మాణాల కోసం రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్, తహశీల్దారు లక్ష్మినరసింహం, ఎంఇఒ షేక్ నజీర్, వైస్ ఎంపిపిలు కంభంశెట్టి ప్రమీల, పెంచలరావు, సొసైటీ చైర్మన్ వాసిపల్లి లక్ష్మీరెడ్డి, చలపతి, విద్యుత్ శాఖ ఏఈ వంగల్లు వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ ఏఈ ఖాదర్ మస్తాన్, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.










