ప్రజాశక్తి-రాంబిల్లి
ఎన్‌ఎఒబి నిర్మాణం కారణంగా సర్వం కోల్పోయిన నిర్వాసితుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరిష్కరించాలని నేవీ నిర్వాసిత జెఎసి పెద్దలు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని వాడనర్సాపురం వద్ద ఎన్‌ఎఒబి ప్రధాన గేట్ ముందు నేవీ నిర్వాసితులు చేస్తున్న ఆందోళన 135వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జెఎసి పెద్దలు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ నావికా స్థావరం నిర్మాణం వల్ల సర్వం కోల్పోయిన తమతో ప్రభుత్వం, నేవీ అధికారులు చేసుకున్న ఒప్పందాలు మేరకు న్యాయం చేయాలని కోరారు. నేవీ నిర్మాణంతో సముద్రంలో చేపల వేట సాగక తమ ఉపాధి పోయిందని, తమ కుటుంబాల జీవనం సాగడం లేదని వాపోయారు. తమకు జీవన భృతి కల్పించాలని, జెట్టీ నిర్మాణం చేపట్టాలని, అంత వరకు నేవీ గేట్ లోపల నుంచి ఆధార్ కార్డు ఆధారంగా చేపల వేటకు అనుమతి ఇవ్వాలని, పెండింగ్ ప్యాకేజీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు.










