ప్రజాశక్తి - రంపచోడవరం
ఆశ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు పోరాటాలకు సిద్ధం కావాలని, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ పిలుపునిచ్చారు. స్థానిక యుటిఎఫ్ సమావేశ మందిరంలో గురువారం ఆశావర్కర్లు యూనియన్ రంపచోడవరం జిల్లా ప్రథమ యూనియన్ నాయకులు మట్ల వాణిశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కార్మికుల హక్కులు చట్టాలను కాలరాస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, కార్మికులు సమస్యలపై ఆందోళ చేస్తున్న కార్మికులు, నాయకులపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు నిర్బంధాలకు గురి చేస్తున్నారన్నారు. కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తూ కార్మికులు పోరాటాలు ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాస్తు శ్రమదోపిడీ చేస్తున్నారని తెలిపారు. జిల్లాల విభజన సరిగా జరగకపోవడంతో ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. చనిపోయిన ఆశావర్కర్లు కు నష్టపరిహారం రూ.10లక్షలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పెన కిరణ్ మాట్లాడారు.
నూతన కమిటీ ఎన్నిక
అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ రంపచోడరం జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బీరబోయిన దారేశ్వరి, మట్ల వాణిశ్రీ, కోశాధికారిగా కళింకోట రమణమ్మ, గౌరవ అధ్యక్షులుగా పల్లపు వెంకట్, ఉపాధ్యక్షులుగా సవీర్ల వెంకటలక్ష్మి, కుంజం రాధమ్మ, పల్లాల లింగమ్మ, కుంజం వీరలక్ష్మి, ముత్తమ్మ, సహాయ కార్యదర్శులుగా కె.జయలక్ష్మి, సారపు వెంకటలక్ష్మి, కొపురి చంద్రవతి, ముత్యాలమ్మ, కొమరం, చెల్లయమ్మ, మరో 12మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పూనెం సత్యనారాయణ, కంభం శాంతిరాజు, పుట్ట రామరాజు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లిరెడ్డి పాల్గొన్నారు.










