Jun 22,2023 01:04

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ డిపిఒ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. సిఐటియు కాకినాడ నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ, జిల్లా కోశాధికారి ఎంవి రమణ, సిఐటియు కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు పంచాయతీ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చారని, కానీ నేటికీ పంచాయతీ కార్మికులను రెగ్యులర్‌ చేయకుండా ఏళ్ల తరబడి వారి చేత సేవలు చేయించుకుంటున్నారని చెప్పారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు చేయటం లేదని, పోస్ట్‌ శాంక్షన్‌ ఆర్డర్స్‌ కూడా ఇవ్వట్లేదని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కూడా కల్పించట్లేదని అన్నారు. కొన్ని పంచాయితీలలో నెలల తరబడి వేతనాలు బకాయి పెట్టుకుని కార్మికులకు ఇవ్వట్లేదని ప్రతిపాడు మండలం గజ్జనపూడిలో పది నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదన్నారు. కార్మికులకు సబ్బులు నూనెలు వంటి కనీస సౌకర్యాల్ని అన్ని పంచాయతీల్లో కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, కార్మికు లందరికీ ఐడెంటీ కార్డులు ఇప్పించాలన్నారు. కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కల్పించాలని, ప్రమాదవశాత్తూ మరణిస్తే ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలన్నారు. ధర్నా అనంతరం జిల్లా పంచాయతీ అధికారి ఆర్‌విక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. జిల్లాలో వివిధ పంచాయతీల్లో ఉన్న సమస్యలు పరిష్కరించేలా, బకాయి వేతనాలు ఇప్పించే విధంగా కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి.రాజా, యేసు, రాజు, రమణ, ఆశీర్వాదం, సత్తిబాబు, గాంధీ, రమణ, శ్రీను, బుల్లి, రాజు, నాగరాజు, చిన్న, నూకయ్య, సత్తిబాబు, లక్ష్మి, రాములమ్మ పాల్గొన్నారు.