పిడుగురాళ్ల: పట్టణంలోని పారిశుధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో బంగ్లా సెంటర్ నుండి గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఆఫీస్ వరకు బుధవారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఫణీంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అమరారపు సాల్మన్ హాజరై మాట్లాడుతూ ఏళ్ల తరబడి పని చేస్తున్న పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయకుండా అరకొర వేతనాలతో వెట్టి చాకిరి చేయించడం సబబు కాదన్నారు. కరోనా సమయంలో వారి సేవలను కొనియాడి, వారి కాళ్లను కడిగిన ప్రధాని నరేంద్ర మోడీ, వారికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని విమర్శించారు. చనిపోయిన కార్మికులకు ఎలాంటి పరిహారం అందలేదని అన్నారు. తాను అధికారంలోకి వస్తే పారిశుధ్య కార్మికులందరినీ క్రమబద్ధీకరిస్తానని నాడు జగన్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు దాటుతున్నా దాని ఊసే లేదని అన్నారు. పారిశుధ్య కార్మికులకు నష్టం చేసే ఆప్కాస్ సంస్థను తీసుకురావడం వల్ల ప్రభుత్వం నుండి రావాల్సిన ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సబ్బులు, నూనెలు, యూనిఫామ్ వెంటనే ఇవ్వాలని, ఎన్.ఎం.ఆర్ ఇంజనీరింగ్ విభాగ కార్మికులకు పారిశుద్ధ కార్మికులతో అలవెన్స్‌తో కూడిన వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, కరోనా సమయంలో తీసుకున్న కార్మికులను పారిశుధ్య కార్మికుల్లో విలీనం చేయాలని, వీటిని వెంటనే అమలు చేయని పక్షంలో దశలవారీగా ఆంధ్రాలో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మల్లయ్య, సిఐటియు మండల కార్యదర్శి కె.శ్రీనివాసరావు, పారిశుద్ధ కార్మికులు కె.సీతారామయ్య, బి.రామారావు,ఎం. నాగయ్య, గురవయ్య,వెంకయ్య,శ్యాంకోటి,పద్మ,మార్తమ,వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.










