Aug 21,2023 23:47

వినతిపత్రాన్ని ఇస్తున్న సిఐటియు నేత ఉమామహేశ్వరరావు, పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి-పాడేరు: గ్రామపంచాయతీ కార్మికుల టెండర్‌ పద్ధతి రద్దు చేయాలని, బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అల్లూరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద సిఐటియు, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామాలను పరిశుభ్రంగా చేస్తూ ప్రజా ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుతున్న పారిశుద్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. పాడేరు, అరకు వ్యాలీ మేజర్‌ పంచాయితీల్లో నాలుగు నెలలుగా వేతనాల బకాయిలు ఉన్నాయని తెలిపారు. సచివాలయాల్లో గ్రీన్‌ అంబాసిడర్‌ కార్మికులకు సంవత్సరం నుండి వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు. ఇలా అయితే కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. జీవో 551 ప్రకారం కార్మికులకు గుర్తింపు కార్డులు, కనీసం వేతనాలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పోరాడి సాధించుకున్న జీవోలని కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ జీనబంధు మాట్లాడుతూ, కార్మికుల్లో అందరూ వెనకబడిన గిరిజనని అందుకే ప్రభుత్వాలు చిన్న చూపు చూపిస్తున్నాయని విమర్శించారు. పంచాయతీ కార్మికులకు తక్షణం ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యూనిఫార్మ్‌, బూట్లు, రైన్‌ కోట్లు, బ్లౌజులు వంటివి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలపై ఈనెల 28న అన్ని ఎంపిడిఓ కార్యాలయాల ముందు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కారం కాకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి సన్నద్ధం కావాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు అర్జున్‌, వెంకట్‌, బుద్దు, వెంకట్రావు పాల్గొన్నారు.