ప్రజాశక్తి-కాకినాడ నగరంలోని ఎల్విన్ పేటలోని నేషనల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ, ధర్నా చేశారు. నర్సింగ్ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, అర్హత ఉన్న అధ్యాపకులతో పాఠాలు చెప్పించాలని, వాచ్‌మేన్, వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న కాలేజ్ ఎమ్‌డి ఎం.వెంకటరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేకసార్లు సమస్యలపై ఎమ్‌డి దృష్టికి తీసుకెళ్లినా స్పందించక పోవడంతోఉదయం 8.30 గంటల నుంచి టిఫిన్, భోజనం చేయకుండా సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యార్థినులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఎఒ శ్రీనివాస్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.వరహాలు, నాయకులు టి.రాజా మాట్లాడుతూ బిఎస్‌సి నర్సింగ్ చదువుతున్న విద్యార్థులకు బిఎస్‌సి విద్యార్థులతో పాఠాలు చెప్పించడం దారుణం అన్నారు ఎంఎస్‌సి అర్హత ఉన్న అధ్యాపకులతో పాఠాలు చెప్పించాలని, వాచ్మెన్, వార్డెన్, అయాలు పోస్టులు వేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల అసభ్య పదజాలంతో ఉపయోగించిన మేనేజింగ్ డైరెక్టర్ ఎం.వెంకటరావు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలకు సంబంధించిన పేరుతో బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ఎటువంటి అనుమతి లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా నిర్వహిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జయరాం, నందన, అనూష, సుశీల, ప్రసన్న, డింపుల్, తల్లిదండ్రులు బిస్మిల్, నారాయణరావు, రంగారావు, విద్యార్థులు పాల్గొన్నారు.










