
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ముఠా కార్మికులకు ఎటువంటి చట్టాలు అమలు కాలేదని బుధవారం నర్సీపట్నంలో ముఠా కార్మికులు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా స్థానిక జిసిసి బంకు ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ, ముఠా కార్మికులకు శ్రమకు తగిన ఫలితం అంద లేదన్నారు. పని భద్రత, గుర్తింపు కార్డులు, పిఏఫ్, ఈఎస్‌ఐ, పింఛనుతో కూడిన సమగ్ర చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో అనారోగ్యంతో మరణించిన ముఠా, రిక్షా కార్మిక కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణగా నిలవాలని కోరారు. ఏదైనా ప్రమాదం జరిగితే ముఠా కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, పనిగంటలు, కనీస వేతనాలు అందించాలని సూచించారు.నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు, పెట్రోల్, డీజిల్ ,వంట గ్యాస్ బస్ ఛార్జీలు పెరగడంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ముఠా కార్మికులకు సమగ్ర చట్టం అమలకు వెల్ఫేర్ బోర్డు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపీఎస్ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి, ఎపి రైతు సంఘం జిల్లా ఉపాద్యక్షలు సాపిరెడ్డి నారాయణముర్తి, మూఠా కార్మిక సంఘం నాయకులు ఎం. రమణ, అర్జున్, నానాజీ,రాజు, నాయుడు, తదితరులు పాల్గొన్నారు