Apr 26,2023 23:54

మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి

ప్రజాశక్తి - యలమంచిలి
'యానాద్రి కాలువ పూడిక తీత పనుల గురించి ఎంతో కాలంగా ప్రశ్నిస్తున్నప్పటికీ పరిష్కారం లభించలేదు. ఇటీవల అధికారుల రిపోర్టుల్లో పనులు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఆ పనులు ఎప్పుడు చేశారు? ఎవరు చేశారు' అని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెప్పు గుప్తా అధికారులను ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అధికారులు, కౌన్సిలర్లకు మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. పుస్తకాలు చూసి చెబుతామని అధికార్లు చెప్పడం పట్ల కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. వీధిలైట్లు కోసం సొంత ఖర్చుతో వేసుకున్న స్తంభాలకు లైట్లు బిగించడంలో ఇంజనీరింగ్‌ అధికార్లు అలసత్వం వహిస్తున్నారని కౌన్సిలర్‌ అచ్యుతరావు ఆరోపించగా, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని ఇంజనీర్‌ సునీల్‌ సమాధానమిచ్చారు.
ఇదంతా విన్న చైర్‌పర్సన్‌ రమాకుమారి మాట్లాడుతూ ప్రతి నెలా సమావేశాలు జరుగుతున్నా కౌన్సిలర్లు, అధికారుల మధ్య సమన్వయం లోపం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పాలెంలో మున్సిపల్‌ స్థలంలో అక్రమంగా మొక్కలు వేసి ఆక్రమించడంపై చర్యలు చేపట్టాలని దాసరి కుమార్‌ కోరగా అడ్డంగా కంచె నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కుక్కలు, కోతులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య కౌన్సిల్‌ ముందుకు వచ్చినపుడు బడ్జెట్‌ కేటాయింపు గురించి ఆరా తీశారు. సమస్య త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని కమిషనర్‌ జవాబిచ్చారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త మోటారు ఏర్పాటుకు నిధులు మంజూరైనట్లు ఇంజనీరింగ్‌ అధికార్లు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో సులాభ్‌కాంప్లెక్స్‌ల నిర్మాణం చేయాలని చైర్‌ పర్సన్‌ కోరారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ బెజవాడ నాగేశ్వరరావు, ఎంఐ వీరయ్య, ఏఇలు, ఆర్‌ఐ, మేనేజర్‌ ప్రభాకరరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.