ప్రజాశక్తి - తెనాలి : కాంట్రాక్టు లేబర్ ఎబాలిషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా నాయకులు కెబాబుప్రసాద్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక పురపాలక సంఘ కార్యాలయం వద్ద గురువారం మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనను ఉద్దేశించి బాబుప్రసాద్ మాట్లాడుతూ 1970లో కాంట్రాక్ట్ ఎబాలిషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ఆ చట్టం ప్రకారం శాశ్వత స్వభావం గల పనుల్లో కాంట్రాక్ట్ కార్మికులను నియమించడం తగదన్నారు. అయితే ఆ విధంగా కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయిస్తే శాశ్వత కార్మికులతో సమానంగా అన్ని బెనిఫిట్స్ వర్తింపచేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన చట్టం, గ్రాట్యుటి చట్టం, ఫ్యాక్టరీ చట్టం అన్ని వర్తిస్తాయన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్‌వలి, అధ్యక్షులు ఎం.పద్మ, జయలక్ష్మి, వి.లక్ష్మీనారాయణ, ఆర్.వెంకటేశ్వర్లు, మరియమ్మ, సుజాత, శర్మ పాల్గొన్నారు.










