అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం
నాయకులతో వాగ్వాదం, తోపులాట
ప్రజాశక్తి - కాకినాడ
సమస్యలను పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, కంటింజెంట్ వర్కర్లు కదం తొక్కారు. ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. అయినప్పటికి వాటన్నింటినీ దాటుకుని కార్మికులు ధర్నా నిర్వహించారు.
పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, స్కూల్ ఆయాలకు అమ్మబడి నిధుల నుంచి రూ.16వేల వేతనం చెల్లించాలని, బాత్రూంలో ఫోటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలని, మధ్యాహ్న భోజనానికి వంట సామగ్రి, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, స్వచ్ఛంద సంస్థలకు మిడ్డేమీల్స్ అప్పగించరాదని, కార్మికులకు కనీస వేతనం రూ.10 వేలు చెల్లించాలని నినదించారు.
తొలుత కచేరిపేటలోని సుందరయ్య భవన్ నుంచి కార్మికులతో ర్యాలీగా బయలుదేరారు. ఈ సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, జిల్లా కోశాధికారి మలకా రమణలను అరెస్టు చేశారు. కార్మికులు పోలీసులను తోసుకుంటూ కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని డిఎస్‌పి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకుని లాకులవద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, సిఐటియ నాయకులకు వాగ్వాదం జరిగింది. అనంతరం వారు బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడారు. ర్యాలీలు, ధర్నాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ ఇచ్చిన జిఒ 1ని హైకోర్టు రద్దు చేసిందన్నారు. అయినా కూడా కాకినాడలో రాజ్యాంగం బద్ధమైన శాంతియుత ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వండి వడ్డించే బిల్లులు ప్రతి విద్యార్థికి రూ.20 పెంచాలన్నారు. బెండపూడి సీతారామరాజు ట్రస్ట్ పేరుతో వంటలమ్మలకు ప్రభుత్వం చెల్లించే మూడు వేల వేతనాన్ని కార్మికులకు చెల్లించకుండా ట్రస్ట్ యాజమాన్యం రూ.1,500 మినహాయించుకుంటుంటే జిల్లా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజనాన్ని అప్పగించిన పాఠశాలల్లో 87 శాతం విద్యార్థులు తింటున్నారని జిల్లా అధికారులు లెక్కలు చూపిస్తున్నారని, అలాంటప్పుడు విద్యార్థులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలను శుభ్రం చేయడానికి కావాల్సిన శానిటరీ వస్తువులను స్కూలు ఆయాల జీతం నుంచే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇచ్చే రూ.6వేలతో వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. తక్షణం అమ్మబడి నుండి స్కూలు మెయింటినెన్స్ కోసం మినహాయించిన నిధుల నుంచి ప్రతి స్కూలు ఆయాకు రూ.16 వేల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు స్కూలు ఆయాలకు యూనిఫాం ఇవ్వాలని, ఐదవ తేదీలోపే వేతనాలు చెల్లించాలని, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రమణమ్మ, చామంతి మాట్లాడారు. ఈ ధర్నాలో మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు డి.సుబ్బలక్ష్మి, మండల నాయకులు పి.వరలక్ష్మి, సుబ్బలక్ష్మి, స్కూలు ఆయాల సంఘం నాయకులు లోవలక్ష్మి, ఎన్.దేవి, నూకరాజు, సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు రాజేశ్వరి, మేడిశెట్టి వెంకటరమణ, పలివెల వీరబాబు, కుంచే చిన్న, తదితరులు పాల్గొన్నారు.










