ప్రజాశక్తి -యంత్రాంగం
కంచరపాలెం : జివిఎంసి పారిశుధ్య విభాగం క్లాప్ వాహన డ్రైవర్లు సోమవారం జివిఎంసి 53వ వార్డు పరిధి ఆంధ్రకేసరి నగర్ శ్మశాన వాటిక వద్ద నిరసన తెలిపారు. కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని డిమాండ్‌చేశారు. 2021లో విధుల్లోకి తీసుకున్నప్పుడు భవిష్యత్తులో రూ.18,500 చెల్లిస్తామని జివిఎంసి అధికారులు హామీ ఇచ్చారని, ఏళ్లు గడుస్తున్నా తమకు రూ.11 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. జివిఎంసి అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
మధురవాడ : క్లాప్ వాహన డ్రైవర్లకు రూ.26 వేలు వేతనం ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జోన్-2 పరిధిలోని ద్రోణంరాజు కల్యాణ మండపం వద్ద క్లాప్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మధురవాడ జోన్ ఉపాధ్యక్షులు డి.అప్పలరాజు మాట్లాడుతూ, తడి, పొడి చెత్తను సేకరించే క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహనాల డ్రైవర్లు అతి తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాయిదాలు వేస్తూ వస్తున్నారని తెలిపారు. డ్రైవర్ల పట్ల బెదిరింపులు, వేధింపులు ఎక్కువవుతున్నాయని, చెప్పినట్లు పనిచేయడం లేదనే నెపంతో సోమవారం కొందరిని విధుల్లోకి తీసుకోకుండా నిలిపివేయడం అన్యాయమని పేర్కొన్నారు. కార్మికుల జీతాల నుంచి పిఎఫ్, ఇఎస్‌ఐని కాంట్రాక్టర్ కోత పెడుతూ ఆయా సంస్థలకు జమ చేయడంలేదని తెలిపారు. దీనిపై కాంట్రాక్టర్‌ను జివిఎంసి ప్రశ్నించకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖ బాధ్యత తీసకొని యూనియన్ నాయకులతో చర్చించి క్లాప్ వాహనాల డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










